25thJuneeditorial | సువర్ణసీమ వైపు రాయలసీమ
25thJuneeditorial | సువర్ణసీమ వైపు రాయలసీమ
25thJuneeditorial | జొన్నగిరి బంగారు గనులతో సువర్ణాధ్యాయం ప్రారంభం
రాయలసీమను రత్నాల సీమగా మార్చే దిశగా అడుగులు
ఉపాధి, పరిశ్రమలతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయా?
25thJuneeditorial | రాయలు ఏలిన సీమ రతనాల సీమ అనే గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి ఎంతో హృద్యంగా ఆలాపించారు. దానిని వినని వారు ఎవరూ ఉండరు. రత్నాలను దోసిళ్లతో ఆనాడు పోసినారంటూ ఆనాటి గేయాన్ని, అమరగాయకుడు ఘంటసాల నోట వెలువడిన గీతాన్ని ఇప్పటికీ వింటూనే ఉంటాం.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాయలసీమ కరవు కాటకాలకు గురైనప్పుడు జోలె పట్టిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి ఎంతో పేరుంది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఆయన హిందూపురాన్ని తాను గెలిచిన మూడు నియోజకవర్గాల్లో ఒకటిగా ఎంచుకున్నారు. ఇప్పటికీ ఆయన కుమారుడు బాలకృష్ణ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారు గనులు ఉన్నాయన్న వార్తలు వాస్తవమేనని ఇప్పుడు రుజువు కాబోతున్నది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో జొన్నగిరి వద్ద బంగారాన్ని శుద్ధి చేసే కర్మాగారాన్ని బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. ఇది ఆంధ్రప్రజలు చేసుకున్న అదృష్టం. రాయలసీమను రత్నాల సీమగా మార్చడం దీనితోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అది విన్నప్పుడు మనసు పులకిస్తుంది. ఆంధ్ర కళా వైభవాన్ని చాటి చెబుతుంది.
ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారు. రాయలసీమ అనే పేరులో రాజసం ఒలికిపడుతుంది. రాయల పాలన నాటి పరిస్థితులు పునరావృతం కావాలని కోరుకోని ఆంధ్రులు ఎవరూ లేరు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు ఇంతవరకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారంతా కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, తదుపరి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కరరెడ్డి మొదలైన వారంతా రాయలసీమకు చెందిన వారే. అదే సందర్భంలో రాయలసీమను రాళ్ల సీమగానూ, ఎడారి ప్రాంతంగానూ ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడి వారే.
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానంటూ చంద్రబాబు నాయుడు సమయం వచ్చినప్పుడల్లా ప్రకటన చేస్తుంటారు. తాను కన్న కలను సాకారం చేయడానికి ఇప్పుడు తగిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు అన్నారు. జొన్నగిరిలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుంది. 400 కిలోల సామర్థ్యంతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటికే 800 మందికి ఉపాధి లభిస్తోంది. 1,500 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దీనిని వృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఐదువేల మందికి ఈ గోల్డ్ మైన్స్‌లో ఉపాధి దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు.
ఇక్కడ నగల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులను ఆయన కోరారు. ఇంత వరకు కర్ణాటకలోని కేజీఎఫ్ గోల్డ్ మైన్స్‌కే పేరుండేది. ఇప్పుడు జొన్నగిరికి ఆ పేరు రానుంది. రాయలసీమకు త్వరలోనే ఉక్కు ఫ్యాక్టరీ రానుందనీ, ఇప్పటికే రాయలసీమలో జలవనరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ, డ్రోన్ల ఫ్యాక్టరీ కూడా రానున్నదనీ, భవిష్యత్తులో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోగలవని చంద్రబాబు చెప్పారు.
