సాత్విక్ విజయాలతో రాష్ట్రానికి అంతర్జాతీయ ఖ్యాతి

  • సింగపూర్ ఓపెన్ స్వర్ణ విజేతకు శాప్ ఘన సత్కారం
  • మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే ప్రభుత్వ లక్ష్యం
  • ఏపీ నుంచి మరింత మంది ప్రపంచ స్థాయి క్రీడాకారుల తయారీ చేస్తాం
  • క్రీడాకారుల అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటాం
  • సాప్ చైర్మన్ రవి నాయుడు

ఆంధ్రప్రభ, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజును బుధవారం విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు.

శాప్ ఉపాధ్యక్షుడు, ఎండీ ఎస్. భరణి తో కలిసి సాత్విక్‌ను సన్మానించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రవి నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజు బ్యాడ్మింటన్ రంగంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలు సాధించడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. ఆయన విజయాలు రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సింగపూర్ ఓపెన్‌తో పాటు థాయిలాండ్ ఓపెన్‌లోనూ సాత్విక్ ప్రదర్శించిన అత్యుత్తమ ఆటతీరు భారత బ్యాడ్మింటన్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందన్నారు.

రాష్ట్ర క్రీడా రంగానికి ఆయన సాధించిన విజయాలు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని కొనియాడారు. ఈ సందర్భంగా సాత్విక్ సాయిరాజును రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలవనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు యువతను క్రీడల వైపు ఆకర్షించే బాధ్యత కూడా తీసుకోవాలని రవి నాయుడు సూచించారు. సాత్విక్ సాయిరాజు రాష్ట్రంలో ఆధునిక బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. అలాంటి ప్రయత్నాలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

క్రీడాకారుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.90 లక్షల బకాయిలను ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. అయితే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు, శిక్షణా కేంద్రాలు, అకాడమీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాబోయే ఏషియన్ గేమ్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ పోటీల్లోనూ సాత్విక్ మరిన్ని పతకాలు సాధించి దేశానికి కీర్తి తేవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారయ్యేలా ప్రభుత్వం, క్రీడా సంస్థలు, క్రీడాకారులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ ఏవో రమావత్ వెంకటరమణ నాయక్, అంతర్జాతీయ క్రీడాకారిణి సూర్య చరిష్మా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు, క్రీడా అధికారులు పాల్గొన్నారు.