యూరియా యాప్ రద్దు చేసి పాత విధానంలోనే సరఫరా చేయాలి
రైతులకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్
తాడ్వాయి, ఆంధ్రప్రభ: యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్ విధానాన్ని రద్దు చేసి, గతంలో అమలు చేసిన పాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలని టీఆర్‌ఎస్ (తెలంగాణ రక్షక సేన) పార్టీ మండల అధ్యక్షుడు భుజంగరావు డిమాండ్ చేశారు.
బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో మక్కజొన్న, సోయాబీన్, పత్తి, మినుము, పెసర, కంది, వరి తదితర పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం అమల్లో ఉన్న యాప్ విధానం కారణంగా రైతులకు అవసరమైన మేర యూరియా అందడం లేదని పేర్కొన్నారు.
అందువల్ల వెంటనే యాప్‌ను రద్దు చేసి, పాత విధానంలోనే యూరియా సరఫరా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. యూరియా యాప్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
దేశానికి వెన్నెముకలాంటి రైతన్నకు అన్యాయం జరిగితే తమ పార్టీ ఊరుకోదని, అవసరమైతే రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని భుజంగరావు హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాత విధానంలోనే యూరియా సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాయిపల్లి గ్రామ అధ్యక్షుడు సాయిలు, యూత్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
