పేదలకు వరంగా మెగా సర్జికల్ క్యాంప్
నేటి నుంచి నాలుగో విడత ఉచిత శస్త్రచికిత్సల శిబిరం.. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో జూన్ 25 నుంచి నిర్వహించనున్న నాలుగో విడత ఉచిత మెగా సర్జికల్ క్యాంప్‌కు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే, ప్రముఖ సీనియర్ వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు డా. చిక్కుడు వంశీకృష్ణ బుధవారం పరిశీలించారు.
శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులు, వైద్య సిబ్బంది సమన్వయం, రోగులకు అందించాల్సిన సేవలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాంప్‌కు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ, గతంలో అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో మూడు విడతలుగా నిర్వహించిన ఉచిత మెగా సర్జికల్ క్యాంప్‌ల ద్వారా 1,400 మందికి పైగా రోగులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి ఆరోగ్యాన్ని కాపాడినట్లు తెలిపారు.
జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సేవలు పొందాలని, క్యాంప్ విజయవంతానికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డీసీహెచ్‌ఎస్ డా. రామకృష్ణ, డాక్టర్లు మహేష్, ప్రతీప్ రాజ్, నర్సింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
