రూ.35 కోట్ల నిధుల మంజూరుతో గ్రామీణాభివృద్ధికి ఊతం

కడెం, ఆంధ్రప్రభ: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవతో కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో గ్రామీణాభివృద్ధి పనుల కోసం రూ.35 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారీ మొత్తంలో నిధులు సాధించడం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చనున్నాయని తెలిపారు.

రూ.35 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల మంజూరుతో కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో అభివృద్ధి పనులకు వేగం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.