ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడదాం
అట్టహాసంగా కర్నూలు నగరంలో ప్రపంచ ఒలంపిక్
రన్ లో పాల్గొన్న 1500 మంది క్రీడాకారులు .
కర్నూలు, ఆంధ్రప్రభ : ఐక్యతతో క్రీడాకారుల సంక్షేమానికి అనునిత్యం పాటు పడదామని ఏపీ ఎస్పి డి.ఎస్.పి మహబూబ్ బాషా,జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నమయ్య లు వ్యాఖ్యానించారు.మంగళవారం కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఒలంపిక్ డే రన్ ను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ కృష్ణ,రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ గుప్తా, ఆర్ఎస్ఐ నాగ స్వామి, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శివ కిషోర్,జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలంపిక్ సంఘం నాయకులు డాక్టర్ రుద్ర రెడ్డి,అవినాష్ శెట్టి,ఈశ్వర్ నాయుడు, సురేష్ గౌడ్, శ్రీనివాసులు, సునీల్ కుమార్ తో పాటు క్రీడాజ్యోతిని వెలిగించి పరుగున ప్రారంభించారు.
కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన రన్, కిడ్స్ వరల్డ్ మీదుగా రాజువిహార్ కు చేరుకొని అక్కడి నుంచి మౌర్య ఇన్, ఆర్ఎస్ సర్కిల్ ఎస్టిబిసి కళాశాల మీదుగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంకు చేరుకుంది. ఈ సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ముగింపు సభలో డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ప్రతిరోజు క్రీడా సాధనకు కొంత సమయాన్ని కేటాయించి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకే అధిక సంఖ్యలో గుర్తింపు ఉందని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడా సాధన వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నమయ్య మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 28 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఇండియన్ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు ఉష ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో 2036 మొక్కలను నాటేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.చివరిగా అంతర్ పాఠశాలల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.
రన్ లో వివిధ పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో టిడిపి నేత గౌతమ్ రెడ్డి,క్రీడా సంఘాల ప్రతినిధులు పాండు రంగారెడ్డి,శ్రీధర్, రవికుమార్, మాధవరావు,లోకేష్, రమణయ్య,శ్రీరాములు యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
