CPS Family Pension | 11వేల మంది సీసీఎస్ ఉద్యోగులకు లబ్ధి…
CPS Family Pension | 11వేల మంది సీసీఎస్ ఉద్యోగులకు లబ్ధి…
ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీపై కీలక నిర్ణయం
CPS Family Pension | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్ అంశంపై స్పష్టతనిస్తూ ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గ్రాట్యుటీ హక్కులను పరిగణనలోకి తీసుకుని ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
2017 నుంచి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్, ఇతర ప్రయోజనాల అమలుకు మార్గం సుగమమైంది.
ఈ నిర్ణయం వల్ల సీపీఎస్ ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగి కుటుంబ భద్రతకు సంబంధించి చాలా కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇది ఉద్యోగుల హక్కుల సాధనలో కీలక ముందడుగని అన్నారు. భవిష్యత్తులో సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
