ట్రాఫిక్ బాధ్యత ఆటో డ్రైవర్లదే

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
పుట్టపర్తి సీఐ యువరాజు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పుట్టపర్తి పట్టణ సీఐ యువరాజు సూచించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణికులకు మెరుగైన సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ యువరాజు మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందన్నారు. డ్రైవర్ల ప్రవర్తన కూడా పుట్టపర్తి ప్రతిష్టను ప్రతిబింబిస్తుందని గుర్తు చేశారు.

పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపివేయడం వల్ల వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గణేష్ గేట్, గోపురం గేట్ ప్రాంతాల్లో ఆటోలను నిలపరాదని, కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలని సూచించారు.

ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్, డ్రైవర్ వివరాలు, వాహనానికి సంబంధించిన అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, విదేశాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటో డ్రైవర్లు కృషి చేయాలని సూచించారు.

అలాగే గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ రాజకుల్లాయప్ప, ఈగల్ ఎస్‌ఐ శ్రీహరి, పోలీసు సిబ్బంది, సుమారు 150 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.