ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు: గంట రవికుమార్

వరంగల్, ఆంధ్రప్రభ: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, మహోన్నత దేశభక్తుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ధర్మారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ దేశ సమగ్రత, జాతీయ సమైక్యత కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను స్మరించుకున్నారు. “ఒకే దేశంలో రెండు చట్టాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు” అనే నినాదంతో దేశ ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిస్థాయిలో విలీనం చేయాలనే లక్ష్యంతో పోరాడిన ముఖర్జీ, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి జైలులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని తెలిపారు. అందుకే ఆయన వర్ధంతిని బీజేపీ శ్రేణులు ‘బలిదాన్ దివస్’గా నిర్వహిస్తున్నాయని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు ద్వారా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చిందని గంట రవికుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్ నేడు భారతదేశంలో పూర్తిస్థాయి అంతర్భాగంగా మారి అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశభక్తి, జాతీయవాద భావజాలం నేటి యువతకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ కుడికాల శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, జిల్లా నాయకులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునాథ్ రెడ్డి, త్రిలోక్, పోలేపాక మార్టిన్ లూథర్, బైరి మురళీకృష్ణ, అంకాల జనార్ధన్, కంది క్రాంతి కుమార్, గోదాసి అశ్విన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.