జుక్కల్‌లో నాసిరకం విద్యుత్ పనులు..
జుక్కల్‌లో నాసిరకం విద్యుత్ పనులు..
- ప్రమాదాలకు ఆహ్వానం..
- వర్షానికే ఒరిగిన ట్రాన్స్‌ఫార్మర్..
- ఆందోళనలో ప్రజలు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలో చేపడుతున్న విద్యుత్ పనుల్లో నాణ్యత లోపించిందంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల ఏర్పాటు పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, రోడ్డుపై ఉన్న వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి కొత్త గద్దె ఏర్పాటు చేసి పొలం పక్కన ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించారు. అయితే నాసిరకం నిర్మాణం కారణంగా ఇటీవల కురిసిన స్వల్ప వర్షానికే ట్రాన్స్‌ఫార్మర్ గద్దెతో సహా ఒరిగిపోయి మరో విద్యుత్ స్తంభానికి ఆనుకుని నిలిచింది. లేదంటే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు.

అదేవిధంగా, విద్యుత్ స్తంభాలను సరిగా పాతకపోవడంతో పలు చోట్ల స్తంభాలు వంగిపోయాయి. పెద్ద లైన్ స్తంభాలు చిన్న లైన్ స్తంభాలకు తగిలే స్థితికి చేరుకోవడంతో ప్రమాద భయం నెలకొంది. చిన్నపాటి గాలివానకే అనేక స్తంభాలు వంగిపోవడం పనుల నాణ్యతపై అనుమానాలకు తావిస్తోంది.
మరో కాంట్రాక్టర్ చేపట్టిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పనుల నాణ్యతను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వస్తోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
