విశాఖ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం
విశాఖ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం
దక్షిణ్ ఎనర్జీ కంపెనీలో చెలరేగిన మంటలు
నలుగురు కార్మికులు సజీవదహనం
సహాయక చర్యలు ముమ్మరం
ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో: విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరవాడలోని దక్షిణ్ ఎనర్జీ సంస్థలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిశ్రమ ప్రాంగణం ఒక్కసారిగా అగ్నికీలలతో కమ్ముకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు సజీవదహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురు కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించగా, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించాయి.
ప్రాథమిక వివరాల ప్రకారం కంపెనీలోని రసాయనాలు లేదా ఇంధన సంబంధిత విభాగంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పరిశ్రమలో భారీగా పొగలు, మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.
ఘటనలో మరికొందరు కార్మికులు గాయపడినట్లు సమాచారం. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతులు మరియు గాయపడిన వారి వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్పందించిన హోం మంత్రి
పరవాడ ఫార్మసిటీలో అగ్నిప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
