Bio Mining Telangana | బయో మైనింగ్‌తో భారీ మార్పు

Bio Mining Telangana | బయో మైనింగ్‌తో భారీ మార్పు

Bio Mining Telangana | చెత్త కొండల తొలగింపుతో పర్యావరణ పరిరక్షణకు ఊతం
28.34 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల విజయవంతమైన తరలింపు
బయో మైనింగ్‌తో మున్సిపాలిటీలకు 372 ఎకరాల భూమి రీక్లెయిమ్
డంపింగ్ యార్డుల స్థానంలో గ్రీనరీ, వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు

Bio Mining Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అత్యంత వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో అంతే వేగంగా ఘన వ్యర్థాల ఉత్పత్తి, టన్నుల కొద్దీ చెత్త నిల్వలు పేరుకుపోతుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో రెండు దశాబ్దాలుగా చెత్త నిల్వలు పేరుకుపోతున్న కారణంగా డంపింగ్ ద్వారా వెదజల్లుతున్న దుర్వాసనతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా డంపింగ్ యార్డులను తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జవహర్‌నగర్ వంటి భారీ డంపింగ్ యార్డుల భారం తగ్గించుకోవడంతో పాటు పురపాలికల్లో గాలి, నీరు కలుషితం కాకుండా కాపాడుకునేందుకు లక్షల టన్నుల పాత చెత్త నిల్వలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2023లో బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించింది. రెండేళ్లలో చెత్త నిల్వలను తొలగించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బయోమైనింగ్ ఇంకా కొనసాగుతోంది. బయోమైనింగ్‌లో చెత్త నిల్వలను తొలగించడంతో పాటు సుమారు 372 ఎకరాల భూమిని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

28.34 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల తరలింపు

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పర్యావరణహితమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2023లో ఈ బయోమైనింగ్ విధానాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 118 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వ్యాప్తంగా మొత్తం 36.74 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించాలని భావించారు. ఈ మొత్తానికి దాదాపు రూ.178 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేయగా, కేంద్రం రూ.70 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.108 కోట్లను భరిస్తోంది.

ఈ మేరకు చెత్త నిల్వలలోని వ్యర్థాలను బయో సాయిల్, ఆర్‌డీఎఫ్, ఇనర్ట్ (కాల్చలేని డీకంపోజ్ పదార్థాలు)గా విభజిస్తున్నారు. ఈ వ్యర్థాల ద్వారా ప్లాస్టిక్, వుడ్ తదితర రీసైక్లింగ్ ప్రక్రియల అనంతరం లభించే బయో సాయిల్‌ను ఎరువుగా లేదా లో-లేయింగ్ ప్రాంతాల్లో రోడ్లకు సమాంతరంగా పూడ్చివేయనున్నారు. ఆర్‌డీఎఫ్‌ను పరిశ్రమలకు వినియోగించనున్నారు.

ఈ బయోమైనింగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 36.74 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటివరకు 78 శాతం పనులు పూర్తి చేసి 28.34 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు రెండేళ్లలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, వర్షాలు తదితర కారణాల రీత్యా గడువులోగా పూర్తి చేయడంలో జాప్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

372 ఎకరాలు స్వాధీనం

మున్సిపల్ శాఖ చేపట్టిన ఈ బయోమైనింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఉన్న డంపింగ్ యార్డులలో చెత్తను పూర్తిస్థాయిలో తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 118 మున్సిపాలిటీలలో ఈ బయోమైనింగ్ చేపడుతుండగా, కొత్తగా మరో 21 మున్సిపాలిటీలు ఈ జాబితాలోకి చేరాయి.

ఇప్పటికే 105 మున్సిపాలిటీలలో 50 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో చెత్త వ్యర్థాలను తొలగించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 372 ఎకరాల భూమిని ఆయా మున్సిపాలిటీలు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సీడీఎంఏ అధికారులు పేర్కొంటున్నారు.

వీటిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 22 ఎకరాలు, వికారాబాద్‌లో 10 ఎకరాలు, మెట్పల్లి మున్సిపాలిటీలో 11 ఎకరాలు, యాదగిరిగుట్టలో 5 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపు, వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థానిక పుర సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులు చెబుతున్నారు.