అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం కలచివేసింది : మోదీ
- లక్నో అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. సహాయక చర్యలకు ఆదేశాలు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
“లక్నో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం కలగడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారు” అని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
మూడు అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో భవనంలో ఉన్న పలువురు విద్యార్థులు మంటలు, దట్టమైన పొగ మధ్య చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు విద్యార్థులు పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వైద్య బృందాలు గంటల తరబడి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వాణిజ్య భవనాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ఈ ఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
