గంజాయి వినియోగదారులపై ఉక్కుపాదం
9 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు
నేరాలకు దూరంగా ఉండాలని కదిరి టౌన్ పోలీసుల హెచ్చరిక
సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : గంజాయి వినియోగం, ఇతర నేర స్వభావం గల వ్యక్తులపై కదిరి టౌన్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 మంది వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బైండ్ ఓవర్ చేసిన వారిలో కదిరికి చెందిన కలైకం మహమ్మద్ జుబేర్ (27), ఎం. నవీద్ (19), ఎస్. భరద్వాజ్ (19), సాకే పవన్ కుమార్ (34), ఈ. శ్రీకాంత్ (19), పి. పవన్ కుమార్ (25), వి. బాలు (23), ఎం. చరణ్ తేజ్ (19), షేక్ అఫ్నాన్ (21) ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ నెల మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు గుర్తించిన సుమారు 50 మందిపై బైండ్ ఓవర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భూ వివాదాలకు సంబంధించి 8 మంది, చిన్నపాటి గొడవలకు సంబంధించి 8 మంది, సోషల్ మీడియా అంశాలకు సంబంధించి 7 మంది, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు సంబంధించి 7 మంది, అనుమానితులు 4 మంది, గంజాయి వినియోగదారులు 12 మంది, న్యూసెన్స్ కేసులకు సంబంధించి ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
బైండ్ ఓవర్ చేయబడిన వారిని కదిరి తహసీల్దార్ ఎదుట హాజరుపరచి, ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండేలా ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల విలువైన బాండ్లు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది కాలంలో మళ్లీ నేరాలకు పాల్పడితే సంబంధిత నివేదికను తహసీల్దార్‌కు పంపించి, బాండ్ మొత్తాన్ని వసూలు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, బైండ్ ఓవర్ అయిన వారిపై నిరంతర నిఘా ఉంటుందని కదిరి టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
