Lucknow | కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

Lucknow | కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

భవనం పై నుంచి దూకిన విద్యార్థులు
సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది, పోలీసులు
ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

Lucknow | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పురానియా ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలో కింది అంతస్తులో ఉన్న దుకాణంలో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పై అంతస్తుల్లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌కు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలను రక్షించుకునేందుకు కొందరు విద్యార్థులు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు స్థానికులు తెలిపారు. మరికొందరు విద్యార్థులు, సిబ్బంది భవనంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గంటల తరబడి సహాయక చర్యలు
పలు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం యోగి ఆదేశాలు
ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ (Yogi Adityanath) వెంటనే స్పందించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను గుర్తించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు
ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం కింది అంతస్తులోని షాపులో మంటలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.