బాధిత కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు..
కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల వివిధ ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను నిర్మల్ జిల్లా మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండీ రఫీక్ అహ్మద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కడం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కడం మండల కేంద్రానికి చెందిన జాలిగామ నరసయ్య కుమారుడు జాలిగామ వినయ్ ఇటీవల కన్నాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కడం గ్రామానికి చెందిన జాలరి నాగుల రాజశేఖర్ చేపల వేటకు వెళ్లిన సమయంలో గాలిదుమారం కారణంగా తెప్ప బోల్తాపడి కడం ప్రాజెక్టులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
అదేవిధంగా, కడం గ్రామానికి చెందిన అబ్దుల్ రఫీక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లగా అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్, బిగ్ టీవీ రిపోర్టర్ రాపర్తి వెంకటేష్ (చింటూ) తండ్రి రాపర్తి నారాయణ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు.
ఈ విషాద ఘటనల విషయం తెలుసుకున్న ఎండీ రఫీక్ అహ్మద్, భూక్య అమ్మి బాపూరావు మృతుల కుటుంబాల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కడం మండల సీనియర్ నాయకుడు ముబారక్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఎండీ హసీబ్, నాయకులు ఆకుల అనిల్ కుమార్ గౌడ్, జాకీర్, సలీం తదితరులు పాల్గొన్నారు.
