Pawan-Kalyan | మొక్క‌లు నాటిన పవన్ కళ్యాణ్

Pawan-Kalyan | మొక్క‌లు నాటిన పవన్ కళ్యాణ్

Pawan-Kalyan | ధ్వంసమైన కొండలకు మళ్లీ జీవం..
మర్రి మొక్కతో పవన్ సంకల్పం
ధ్వంసమైన అటవీ ప్రాంత పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమం
పర్యావరణ పునరుద్దరణ దిశగా అడుగులు వేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు
మైనింగ్ తో క్షీణించిన అడవుల పునఃస్థాపన దిశగా అడుగులు

Pawan-Kalyan | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మైనింగ్ కార్యకలాపాలతో దెబ్బతిన్న అటవీ ప్రాంతాలకు మళ్లీ పచ్చదనం తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ( Pawan Kalyan) కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నందనవనం’ పేరుతో చేపట్టిన ఈ బృహత్తర పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయన దేశవాళీ మర్రి మొక్కను నాటారు. ప్రకృతి విధ్వంసానికి గురైన ప్రాంతాలను మళ్లీ హరితవనాలుగా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

అరణ్యారామం తర్వాత నందనవనం

అటవీ, పర్యావరణ శాఖల పరిపాలన, పర్యవేక్షణ కార్యాలయ సముదాయం ‘అరణ్యారామం’కు భూమిపూజ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైనింగ్ కారణంగా తీవ్రంగా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని తెలిపారు.

మైనింగ్‌తో క్షీణించిన ప్రకృతి

2013 నుంచి ఆ ప్రాంతంలో కొనసాగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల సహజ సిద్ధమైన కొండలు, అడవి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. అటవీ సంపద నష్టపోవడంతో పాటు జీవ వైవిధ్యంపై కూడా ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతికి మళ్లీ జీవం పోసేందుకు ‘నందనవనం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

‘నందనవనం’గా మారాలని సంకల్పం

అక్రమ మైనింగ్‌తో ధ్వంసమైన ప్రాంతమంతా భవిష్యత్తులో సస్యశ్యామలంగా మారి నిజమైన ‘నందనవనం’గా రూపాంతరం చెందాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ మర్రి మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరులను పునరుద్ధరించడం, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక దృష్టి

అటవీ సంపద పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రకృతి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

పలువురు ఉన్నతాధికారుల హాజరు

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య, బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుళ్ జిందాల్‌తో పాటు అటవీ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.