AP | కూటమి నేతలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు..
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పదవుల కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని వైసీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ప్లానింగ్ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నాయకులను ప్రలోభ పెడుతూ, మాట వినని వారినిభయపెట్టి పదవులు కైవసం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు మాత్రం మౌనంగా ఉండడం దారుణమన్నారు. తిరుపతి, హిందూపురం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడికి తెగబడ్డారని, దాంతో ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్‌లో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కోరారు.
విజయవాడ బందర్ రోడ్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్యెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈసందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ… తిరుపతిలో ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు దాడి చేసారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని ఇటీవల ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసామని, భయపెట్టి, బతిమాలి, ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. టెంపుల్ సిటి తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతిలో ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన మరణాల ఘటన మర్చిపోకముందే దాడుల సంస్కృతిని తెరపైకి తెచ్చారన్నారు. ఎన్నికలు జరుగుతున్న చోట భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాలనన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వానికి సేవ చేస్తున్నారని తెలిపారు.