సాయికృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం

సాయికృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరం

సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు
సాయికృష్ణ ఇంటికి చేరుకున్న ఏసీపీ దైవ ప్రసాద్ ప్రత్యేక బృందం
తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన విచారణ

(విజయవాడ, ఆంధ్రప్రభ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు విచారణ అధికారిగా నియమితులైన దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శుక్రవారం సాయికృష్ణ నివాసానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు స్వయంగా విజయలక్ష్మి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను ఏసీపీ దైవ ప్రసాద్‌కు అప్పగించగా, ఆయనతో పాటు ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఉన్న ప్రత్యేక బృందం సాయికృష్ణ ఇంటికి చేరుకుంది.

తల్లి వాంగ్మూలం నమోదు

సాయికృష్ణ అదృశ్యమైన పరిస్థితులు, చివరిసారిగా ఎప్పుడు కనిపించాడు, కుటుంబ సభ్యులకు తెలిసిన విషయాలు, గతంలో జరిగిన పరిణామాలపై తల్లి విజయలక్ష్మి నుంచి పోలీసులు సమగ్ర వివరాలు సేకరించారు. కృష్ణలంకలో ఉన్న సాయికృష్ణ ఇంటికి చేరుకున్న అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారికంగా రికార్డు చేసినట్లు తెలిసింది. కేసులో కీలక ఆధారాలుగా మారే అంశాలపై దర్యాప్తు బృందం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

సీఐ నాగరాజుపై హత్య కేసు

విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అదేవిధంగా సెక్షన్ 127(4) కింద ఒక వ్యక్తిని పదిరోజులకు మించి అక్రమంగా నిర్బంధించిన నేరం, సెక్షన్ 127(6) కింద నిర్బంధించిన వ్యక్తి ఆచూకీని కుటుంబ సభ్యులు లేదా అధికారులకు తెలియకుండా దాచిపెట్టిన నేరాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద కూడా జైలు శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు

సాయికృష్ణ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు పోలీస్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, సంబంధిత అధికారుల వాంగ్మూలాలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం

సాయికృష్ణ అదృశ్యం, అనంతరం వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, ఇప్పుడు సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, మరిన్ని ఆధారాలు ఏవైనా బయటపడతాయా అన్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.