గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

కృష్ణలంక, ఆంధ్రప్రభ : గాదె సాయికృష్ణ కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ గురువారం ఉదయం కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ మామయ్య ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ గాదె సాయికృష్ణ మిస్సంగ్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, డీజీపీ ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారని తెలిపారు.

ఇప్పటికే సీఐ నాగరాజుకు సస్పెండ్‌ చేశారని చెప్పారు. సాయికృష్ణను కనుగొనేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించందని తెలిపారు. ఈ కేసు విషయంలో సాయికృష్ణ కుటుంబసభ్యులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్థితో ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చాలా సీరియస్‌గా ఉన్నారని, ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ నుంచి కానిస్టేబుల్స్‌ వచ్చి తన కుమారుడిని స్టేషన్‌ తీసుకువెళ్ళారని సాయికృష్ణ తల్లి తెలిపారు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని చెప్పారు. కూటమికి చెందిన నాయకులంతా తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించారని చెప్పారు. సి.ఐ.నాగరాజుకు సస్పెండ్‌ చేశారని, అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలన్నారు.