తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
- డాక్టర్ డోలి సత్యనారాయణ పిలుపు
కేసముద్రం, ఆంధ్రప్రభ: ఈ నెల 21న మహబూబాబాద్ పట్టణంలోని ఆర్తి గార్డెన్స్‌లో నిర్వహించనున్న డివిజన్ స్థాయి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని డివిజన్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చాగంటి కిషన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల బలిదానాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో జరగనున్న ఆత్మీయ సమావేశానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరుకానున్నారని తెలిపారు. ఉద్యమకారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ సమావేశం వేదిక కానుందని పేర్కొన్నారు. కేసముద్రం మండలానికి చెందిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాంకాల కట్టమల్లు, పీసీసీ సభ్యుడు గుగులోత్ దస్రూనాయక్, గుంజపొడుగు కొమ్మన్న, జేఏసీ కన్వీనర్ మోడం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జేఏసీ మాజీ కన్వీనర్ దండు శ్రీనివాస్, మైస శ్రీనివాస్, అభిషేక్, జనిగెల కొమురయ్య, కీర్తి సమ్మయ్య, గాండ్ల మలేందర్, మాందాటి ఆంజనేయులు, నాగనబోయిన చంద్రకళ, గాయకులు భరత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
