సేవకు సెల్యూట్

సేవకు సెల్యూట్

  • స్నేక్ క్యాచర్‌గా ఉచిత సేవలు
  • జూనియర్ అసిస్టెంట్ సుమన్‌కు సన్మానం

అచ్చంపేట, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ రంగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ, మరోవైపు ప్రజలకు అవసరమైన సమయంలో స్నేక్ క్యాచర్‌గా ఉచిత సేవలు అందిస్తున్న సుమన్ సేవలను అచ్చంపేట ఎమ్మెల్యే అభినందించారు. పాములు ఇళ్లలోకి లేదా జనావాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి వాటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సుమన్ సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సమాజ సేవ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న సుమన్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి అభినందించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవలు చేయడం యువతకు ఆదర్శమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు కూడా సుమన్ సేవలను కొనియాడుతూ, ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.