Adilabad గేట్ మీటింగ్కు నో పర్మిషన్.. కార్మికుల వేతనాల్లో కోత
Adilabad గేట్ మీటింగ్కు నో పర్మిషన్.. కార్మికుల వేతనాల్లో కోత
ఆంధ్రప్రభ బ్యూరో, (Adilabad) ఉమ్మడి ఆదిలాబాద్: యాజమాన్యం అనుమతి లేని గేట్ మీటింగ్ లో పాల్గొన్న కార్మికుల వేతనంపై కోత పడింది. మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిలో పలువురు కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన “బాయిబాట” పర్యటన అనంతరం యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
కవిత తన పర్యటనలో భాగంగా నిన్న తొలుత కాసిపేట-1 గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. గని ఆవరణలో గేట్ మీటింగ్కు అనుమతి లేదని సింగరేణి భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కవితతో పాటు హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్, ఇతర నాయకులు గని వద్దకు చేరుకుని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ నెల 15న నిర్వహించిన హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్కు ముందస్తు అనుమతి తీసుకోలేదని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. అనుమతి లేని సమావేశంలో పాల్గొన్న కార్మికులు పని గంటలను వినియోగించుకున్నందున, ఆ సమయానికి సంబంధించిన వేతనాన్ని కోత విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, కవిత పర్యటన అనంతరం ఈ చర్యలు తీసుకోవడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
