Andhra Pradesh Economy | భారత ఎకనామిక్ పవర్‌హౌస్‌ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

Andhra Pradesh Economy | భారత ఎకనామిక్ పవర్‌హౌస్‌ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

Andhra Pradesh Economy | పెట్టుబడిదారులకు చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం
సెమీకండక్టర్లు, డేటా సెంటర్లకు ఏపీ అనుకూల గమ్యం
నాలెడ్జ్ హబ్‌గా అమరావతి రూపాంతరం
స్టార్టప్‌లు, గ్లోబల్ కనెక్టివిటీపై ప్రభుత్వ దృష్టి

Andhra Pradesh Economy | ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోంది. ఇదే సమయంలో భారతదేశ ఆర్థిక శక్తిగా ఏపీ అవతరించబోతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ సొంతం. ఆక్వా నుంచి ప్రకృతి సేద్యం వరకు వ్యవసాయంలోనూ కీలక భూమిక పోషిస్తోంది. సేవల రంగంలోనూ ముందంజలో ఉంది. గ్లోబల్ మార్కెట్‌కు ఎగుమతులు చేరవేసేందుకు పోర్టులు, విమానాశ్రయాలు సిద్ధం చేస్తున్నాం. ప్రత్యేక పారిశ్రామిక పాలసీలు అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి లభ్యత, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం. ఇన్ని అనుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌ను, ప్రపంచ నగరి అమరావతిని మీరు రెండో నివాసంగా ఎంచుకోవచ్చు.

అమరావతి, ఆంధ్రప్రభ: వికసిత్ భారత్–2047 విజన్‌లాగే స్వర్ణాంధ్ర–2047 విజన్‌కు రూపకల్పన చేశాం. త్వరలోనే భారత ఎకనామిక్ పవర్‌హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానం అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు.

ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా మంగళవారం సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్‌ను నిర్మించామని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందన్నారు. బ్లూ, గ్రీన్ రాజధానిగా అమరావతికి అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ అందించిందని చెప్పారు.

సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను రెండో నివాసంగా ఎంచుకోవాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయిస్తున్నామని తెలిపారు.

రండి… చూడండి.. పెట్టుబడులు పెట్టండి

ఏపీని, అమరావతిని రెండో నివాసంగా చేసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని, అమరావతిలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి సాధ్యమవుతుందన్నారు. సింగపూర్ వరల్డ్ సిటీస్ సదస్సులో “కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్” అంశంపై ఆయన ప్రసంగించారు. ఇన్నోవేటర్స్ అలే, గూగుల్ స్టాల్‌ను సందర్శించారు. సింగపూర్ పెవిలియన్‌లో అత్యాధునిక పట్టణాభివృద్ధి నమూనాలను పరిశీలించారు.

సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అత్యుత్తమంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, సెమికాన్ ఎకోసిస్టమ్ సదస్సులో వివరించారు. గూగుల్‌తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

సుదీర్ఘ తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతమన్నారు. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగాల్లో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఎగుమతులు పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు అనుగుణంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నామని వివరించారు. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పాలసీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో భూమి, నీటి లభ్యత పుష్కలంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నామని వివరించారు.

గ్లోబల్ నగరాలకు ఏపీ కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలతో పాటు వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడా జాప్యం లేకుండా అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తున్నామని పేర్కొన్నారు. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా తీరప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయని తెలిపారు. వీటిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 7 ఆపరేషనల్ విమానాశ్రయాలు ఉన్నాయని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ లభిస్తుందని పేర్కొన్నారు. పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రహదారి, రైల్వే నెట్‌వర్క్‌ను కూడా విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

భవిష్యత్ స్టార్టప్‌లదే…

సమీప భవిష్యత్ అంతా స్టార్టప్‌లదేనని, వాటిని ప్రోత్సహిస్తే భారీ స్థాయిలో ఉత్పత్తి అవకాశాలు ఏర్పడతాయని చంద్రబాబు అన్నారు. పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడాన్ని విజయవంతమైన మార్గంగా చూస్తున్నారని తెలిపారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశామని, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తాయని వెల్లడించారు.

ఈ సదస్సులో మంత్రి పి. నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నాలెడ్జ్ హబ్‌గా అమరావతి

అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ద్వారా అమరావతి–హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కనెక్ట్ చేస్తామని చెప్పారు. బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించడంతో పాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అమరావతిలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయని, డిసెంబర్ నాటికి అది పనిచేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పరీక్షించి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని కోరారు.

Leave a Reply