బెల్లంపల్లిలో టీఆర్ ఎస్ తొలి జెండా ఎగిరేస్తాం..
బెల్లంపల్లిలో టీఆర్ ఎస్ తొలి జెండా ఎగిరేస్తాం..
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుని టీఆర్ఎస్ తొలి జెండాను బెల్లంపల్లిలో ఎగురవేస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.
సోమవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన “బాయి బాట” కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, పాత బస్టాండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం టేకులబస్తీలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాత బస్టాండ్ నుంచి తిలక్ క్రీడా మైదానం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించి, మంగళహారతులతో కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ యువ నాయకుడు పుల్లూరి మౌనిక్ అధ్యక్షత వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్‌పై విమర్శలు చేస్తూ, ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే, ఆయన స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. రెండు నెలలకు ఒకసారి మాత్రమే వస్తూ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీని ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బెల్లంపల్లిలో టీఆర్ఎస్ తొలి విజయ పతాకాన్ని ఎగురవేస్తామని తెలిపారు.
రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ నిధులు ఎప్పుడు అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ప్రజల ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు ఎండీ రియాజ్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్, రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు పార్వతి రాజిరెడ్డి, వెల్ది సుదర్శన్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
