మా పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఇవ్వండి మహాప్రభో..

మా పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఇవ్వండి మహాప్రభో..

కలెక్టర్‌ను ఆశ్రయించిన రైతులు

బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : కర్లపాలెం మండలం దుండివారిపాలెంకు చెందిన రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని కాపాడాలని కోరుతూ మందపాటి అనూష, ఇతర రైతులు సోమవారం పీజీఆర్ఎస్‌లో జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. సర్వే నంబర్ 810లోని భూముల్లో గత 50 ఏళ్లుగా సాగు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం తమ పొలాలకు వెళ్లే మార్గాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై గత ఎనిమిది నెలలుగా పి జి ఆర్ ఎస్ లోను, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు. సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా తమ పొలాలకు వెళ్లే దారి లేకుండా ప్రహరీ నిర్మిస్తున్నారని తెలిపారు.

వ్యవసాయం చేసుకోవడానికి కూడా మార్గం లేకుండా పోవడం దారుణమని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని తమ భూములకు రాకపోకల కోసం శాశ్వత దారి కల్పించాలని రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. లేకపోతే తమ జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.