కార్గిల్ పార్కులో యోగా సందడి!

కార్గిల్ పార్కులో యోగా సందడి!

జలవనరుల శాఖ సిబ్బందికి ప్రత్యేక శిబిరం.. ఒత్తిడిని జయించేందుకు యోగా ఉత్తమ మార్గం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: ‘యోగాంధ్ర 2026’ వేడుకల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కులో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ, ఆయుష్ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్.ఇ) పొన్నాడ సుధాకర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే సిబ్బందికి శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని అన్నారు. వాటిని సాధించడానికి యోగా అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు.

వంశధార ప్రాజెక్ట్ ఎస్.ఇ గురుగుబెల్లి రామచంద్రరావు మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల మానసిక ఏకాగ్రత పెరుగుతుందని, ఉద్యోగ బాధ్యతల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించవచ్చని తెలిపారు.

ఈ శిక్షణ శిబిరంలో జిల్లా ఆయుష్ అధికారి ఉత్తం రాజ్ రాణా, జిల్లా ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. యోగా గురువులు పాండ్రంగి మురళీకృష్ణ, కరుటూరి నాగలక్ష్మి, సాయి లక్ష్మి, వాకర్స్ క్లబ్ ప్రతినిధి కాంక్యాన మురళి తదితరులు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ పద్ధతులపై సిబ్బందికి శిక్షణ అందించారు.

మానసిక ఒత్తిడిని జయించి, నిత్యం ఉత్సాహంగా విధులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సిబ్బంది, ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.