ప్రమాదం జరిగితేనే పట్టింపా..?
ప్రమాదం జరిగితేనే పట్టింపా..?
మంథని మార్కెట్ యార్డు ఎదుట ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
కంచె లేకుండా, వేలాడే వైర్లతో భయాందోళనలో రైతులు, వాహనదారులు
మంథని, (ఆంధ్రప్రభ): మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉండటంతో రైతులు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వెలువడే విద్యుత్ కేబుళ్లు నేలవైపు వేలాడుతూ ఉండటం, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్‌కు వచ్చే రైతులు, హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, పాఠశాల వాహనాలు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాద భయం వెంటాడుతోంది.
స్థానికుల కథనం ప్రకారం, ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచెతో పాటు హెచ్చరిక బోర్డులు కూడా లేవు. చిన్నారులు, పశువులు అనుకోకుండా దగ్గరికి వెళ్లే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నేలపై ఉన్న కేబుళ్ల ద్వారా కరెంట్ ప్రవహిస్తే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ ప్రాంతంలో ధాన్యం తీసుకొచ్చే వాహనాలు, కూలీలు, హమాలీలు ఎక్కువగా తిరుగుతుంటారని, పొరపాటున ట్రాన్స్‌ఫార్మర్ లేదా కేబుళ్లను తాకితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ట్రాన్స్‌ఫార్మర్లకు భద్రతా కంచె, హెచ్చరిక బోర్డులు, సరైన ఎర్తింగ్ వంటి చర్యలు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ ఇక్కడ అవి కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
