ప్రతి రోజు యోగా సాధన చేసి ఆరోగ్యవంతంగా జీవిద్దాం

ప్రతి రోజు యోగా సాధన చేసి ఆరోగ్యవంతంగా జీవిద్దాం

పులిగుండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం
టెంపుల్ యోగాలో పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్

పెనుమూరు, జూన్ 15 (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. మానసిక ఒత్తిడులు, ఆందోళనలు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం పెనుమూరు మండలంలోని పులిగుండు పులిగుండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో నిర్వహించిన టెంపుల్ యోగాలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం యోగా శిక్షకులు జి. శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో దండాసనం, భద్రాసనం, వజ్రాసనం, భుజంగాసనం, శలభాసనం, శవాసనం, సీతలి ప్రాణాయామం, సేతుబంధాసనం తదితర యోగాసనాలను ప్రదర్శించారు. ఆయా ఆసనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శరీర సౌష్టవం, మానసిక ప్రశాంతత, శ్వాసకోశ ఆరోగ్యం, వెన్నెముక బలం, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో యోగా పాత్ర కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించాల్సిన ఆరోగ్యకరమైన జీవన విధానంగా స్వీకరించాలని సూచించారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని మండలాల్లో సుమారు 5 వేల మంది ట్రైనర్లను నియమించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారని వెల్లడించారు.

యోగ సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. యోగా, నడక, సమతుల్య ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర-2026 ద్వారా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

కార్యక్రమంలో డీఆర్వో కె. మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి. ఉదయ్ భాస్కర్, ఆయుష్ నోడల్ అధికారి గోవిందప్ప, జిల్లా పర్యాటక అధికారి ఎ.ఎం. నరేంద్ర కుమార్, టూరిజం మేనేజర్ గౌరీ, సీపీఓ శ్రీనివాసులు, పెనుమూరు తహసీల్దార్ లోకేశ్వరి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.