Bhimavaram పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
Bhimavaram పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవు – కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో (Bhimavaram), ఆంధ్రప్రభ:
భీమవరం పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను గుర్తించి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం మున్సిపల్ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వ్యాపారులు, సంస్థలు సమిష్టిగా సహకరిస్తేనే స్వచ్ఛమైన నగరాన్ని నిర్మించగలమని ఆమె పేర్కొన్నారు.
ఆదివారం భీమవరం పట్టణంలోని టౌన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల ముందు చెత్త పేరుకుపోవడం, వ్యర్థాలను రోడ్లపై పడవేయడం గమనించిన ఆమె సంబంధిత దుకాణ యజమానులతో నేరుగా మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి దుకాణ యజమాని తన వ్యాపార సంస్థ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. దుకాణాల నుంచి వెలువడే చెత్తను ప్రత్యేకంగా నిల్వ ఉంచి మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో పారవేయరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
భీమవరం జిల్లా కేంద్రంగా ఉండటంతో పాటు రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టణమని ఆమె పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, వ్యాపార వృద్ధి, పర్యాటక ప్రోత్సాహానికి పరిశుభ్రత ఎంతో కీలకమని తెలిపారు. అపరిశుభ్రత వల్ల పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, పర్యాటక ఆకర్షణ దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
“మన పట్టణం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వీధులు, చెత్త రహిత ప్రాంతాలు ఆరోగ్యకరమైన సమాజానికి సూచికలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు చెత్త సేకరణ, పరిశుభ్రత నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
