మల్లారెడ్డిగూడెం రైల్వే అండర్‌బ్రిడ్జి పనుల పరిశీలన
వికారాబాద్, ఆంధ్రప్రభ : మోమిన్‌పేట్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్‌బ్రిడ్జి పనులను బీజేపీ వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్, దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్న ఆయన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూడాలని అన్నారు.
రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మల్లారెడ్డిగూడెం, గోవిందాపూర్, రామనాథ్‌గూడుపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తామని వడ్ల నందు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు, సర్పంచ్ కుమారుడు విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
