Payakapuram రహదారి భద్రతే లక్ష్యం..
Payakapuram రహదారి భద్రతే లక్ష్యం..
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఆటో డ్రైవర్ల ప్రతిజ్ఞ
పాయకాపురం (Payakapuram), ఆంధ్రప్రభ:
రహదారి భద్రతా నియమాలను ఎల్లప్పుడూ పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని ఆటో డ్రైవర్లు ప్రతిజ్ఞ చేశారు. 6వ ట్రాఫిక్ సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన పెంపొందించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు అతివేగంగా వాహనం నడపబోమని, మద్యం సేవించి లేదా మత్తు పదార్థాల ప్రభావంలో ఆటో నడపబోమని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించబోమని ప్రమాణం చేశారు.
అలాగే ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని, ఆటోలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించబోమని, ట్రాఫిక్ సంకేతాలు మరియు పోలీసుల సూచనలను గౌరవించి పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్, సబ్‌ఇన్‌స్పెక్టర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
