Nandyal వెన్నుపోటుకు రెండేళ్లు.. వైసీపీ శక్తి ప్రదర్శన!
Nandyal వెన్నుపోటుకు రెండేళ్లు.. వైసీపీ శక్తి ప్రదర్శన!
డా. వైఎస్సార్ విగ్రహంపై శిల్పా సవాల్
నంద్యాల బ్యూరో(Nandyal), ఆంధ్రప్రభ:
రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని, ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను, రైతులను, యువతను వంచించి రెండేళ్లు పూర్తయిందని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి శక్తి ప్రదర్శన చేశారు.
శ్రీనివాస సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ విధానాలకు నిరసనగా నాయకులు ఎడ్లబండ్లు ఎక్కి, గాడిదలపై పచ్చ గుడ్డలు కప్పి వినూత్నంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సీఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పీపీ మధుసూధన్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద రూ.1,500, నిరుద్యోగ భృతి కింద రూ.3,000, తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు లబ్ధిదారులను కుదించి ప్రజలను వంచించారని విమర్శించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర కల్పించి పంటలు కొనుగోలు చేశామని, ప్రస్తుతం రైతులకు యూరియా, సాగునీరు కూడా అందక రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో రూ.20 వేలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు.
నంద్యాల శ్రీనివాస సెంటర్లో డా. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్వంసక చర్యలు కూటమి ప్రభుత్వ హయాంలోనే చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. విగ్రహం ధ్వంసమైన అదే ప్రదేశంలో నంద్యాల ప్రజల సాక్షిగా డా. వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠిస్తామని, ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే తన సొంత ఖర్చులతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని సవాల్ చేశారు.
అధికార బలంతో వైఎస్సార్ కళ్యాణ మండపం, శిల్పా సహకార్ సూపర్ మార్కెట్ దుకాణాలను లాక్కున్నారని ఆరోపించిన శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, శిల్పా సేవా కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటును విస్తృతంగా ప్రచారం చేసి, రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

