ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర పునర్నిర్మాణం: సీఎం చంద్రబాబు

ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర పునర్నిర్మాణం: సీఎం చంద్రబాబు

గెలుపుగా కాకుండా బాధ్యతగా ప్రజల తీర్పును స్వీకరించాం

కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు

సంక్షేమం, సుపరిపాలనతో ప్రజల విశ్వాసం పొందుతున్నాం

పెట్టుబడులు, పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు

తిరుపతి, (ఆంధ్రప్రభ): రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించి పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.

2024 ఎన్నికల ఫలితాలను రాజకీయ విజయంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా స్వీకరించామని చంద్రబాబు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇచ్చిన పిలుపుకు ప్రజలు విశేష మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. 57 శాతం ఓటు షేర్‌తో 164 అసెంబ్లీ స్థానాలను ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారని గుర్తు చేశారు. పాలకులుగా కాకుండా ప్రజల సేవకులుగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని, పరిపాలనా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. గత పాలనలో రాష్ట్రం భారీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా పరిస్థితులపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు వివరించామని చెప్పారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, విధ్వంసమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని చంద్రబాబు కొనియాడారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, జాతీయ రహదారులు, విమానాశ్రయాల నిర్మాణం, చంద్రయాన్, గగన్‌యాన్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని అన్నారు. వరుసగా మూడు సార్లు ప్రజలు మోదీకి మద్దతు ఇవ్వడం ఆయన నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా వేలాది కోట్ల రూపాయల పెన్షన్లు అందించామని, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాల ద్వారా మహిళలకు ప్రయోజనాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర సహకారంతో ఆర్థిక సాయం అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు.

ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తూ మెగా డీఎస్సీ ద్వారా 15,941 మంది ఉపాధ్యాయులను, 5,757 మంది కానిస్టేబుళ్లను నియమించామని తెలిపారు. ఉద్యోగులకు రూ.21 వేల కోట్ల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సోలార్ రూఫ్‌టాప్ పథకాలు, పీ-4 కార్యక్రమం, సంజీవని ప్రాజెక్టు వంటి పథకాల ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతుల కోసం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టు, తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ, విశాఖలో ఐటీ పెట్టుబడులు వంటి ప్రాజెక్టులు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు.

రాయలసీమను హార్టికల్చర్, డిఫెన్స్, డ్రోన్, స్పేస్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్ల ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.