SACHIN TENDULKAR | కుమార్తె సారాతో సరదా క్రికెట్..

SACHIN TENDULKAR | కుమార్తె సారాతో సరదా క్రికెట్..

SACHIN TENDULKAR | ఫ్లైట్‌లో సచిన్ బ్యాటింగ్‌
వైరల్‌గా మారిన వీడియో
‘ఎత్తు మారినా.. ఆటిట్యూడ్ మారదు’ అంటూ..
అభిమానులను అలరించిన మాస్టర్ బ్లాస్టర్

SACHIN TENDULKAR | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన సరదా శైలితో అభిమానులను ఆకట్టుకున్నారు. విమాన ప్రయాణంలో కుమార్తె సారా టెండూల్కర్తో కలిసి క్రికెట్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. విమానంలో తన సీటు నుంచి లేచిన సచిన్, ప్రయాణికులు కూర్చునే కారిడార్‌లో బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుని షాట్లు ఆడుతున్నట్లు వీడియోలో కనిపించారు. ఆయన బ్యాట్‌తో ఆడిన షాట్లను సారా అందుకుంటూ, ఇద్దరూ నవ్వుకుంటూ ఆ క్షణాలను ఆస్వాదించారు. ఈ సరదా వీడియోకు సచిన్ “ఎత్తు (Altitude) ఏదైనా.. వైఖరి (Attitude) మాత్రం మారకూడదు” అనే ఆసక్తికర క్యాప్షన్‌ను జత చేశారు.

అంతేకాకుండా అదే విమాన ప్రయాణంలో సచిన్ తోటి ప్రయాణికులను పలకరిస్తూ వారి వద్దకు వెళ్లారు. అభిమానులతో కరచాలనం చేయడం, సెల్ఫీలకు పోజులివ్వడం ద్వారా వారికి మరపురాని అనుభూతిని అందించారు. సచిన్‌ను దగ్గరగా చూసిన ప్రయాణికులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కొందరు అభిమానులు “సచిన్.. సచిన్..” అంటూ నినాదాలు చేయడంతో విమానం లోపలే క్రికెట్ స్టేడియం వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూ అభిమానుల నుంచి విశేష స్పందనను అందుకుంటోంది. మైదానానికి దూరమైనా క్రికెట్‌పై తన ప్రేమ ఏమాత్రం తగ్గలేదని సచిన్ మరోసారి చాటిచెప్పారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.