వారిది గొడ్డలి.. మనది గూగుల్: జగన్పై లోకేష్ ఘాటు విమర్శలు
వారిది గొడ్డలి.. మనది గూగుల్: జగన్పై లోకేష్ ఘాటు విమర్శలు
ప్రజా ప్రభుత్వంతో రాష్ట్రంలో ప్రశాంతత: లోకేష్
జగన్కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ ఉందంటూ విమర్శలు
సంక్షేమం, ఉద్యోగాల కల్పనలో ముందంజలో ఏపీ
రాయలసీమ అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లతో మిషన్ రాయలసీమ
కూటమి ఐక్యతను కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపు
తిరుపతి, (ఆంధ్రప్రభ): తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించిన విజయోత్సవ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి, భద్రత, స్వేచ్ఛ పునరుద్ధరించబడిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న భయాందోళనల పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “మనది గూగుల్.. వాళ్లది గొడ్డలి, మనది డెవలప్మెంట్.. వాళ్లది డిస్ట్రక్షన్” అంటూ విమర్శించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్ తయారీ పరిశ్రమలు వంటి భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని, వాటి విషయంలోనూ జగన్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్కు “క్రెడిట్ చోరీ డిజార్డర్” ఉందని వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ వివరించారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, బీడీ కార్మికులకు రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని చెప్పారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయ నియామకాలు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టామని వెల్లడించారు. త్వరలో మరో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన సేవలను గుర్తు చేసిన లోకేష్, ప్రస్తుతం “మిషన్ రాయలసీమ” కింద రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, క్యారియర్, రిలయన్స్ వంటి సంస్థలు రాయలసీమకు రావడం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తున్నాయని లోకేష్ అన్నారు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
