పనులు కల్పించడం లేదంటూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయింపు
పనులు కల్పించడం లేదంటూ ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయింపు
ఉపాధి హామీ పనులు వెంటనే కల్పించాలని కూలీల డిమాండ్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఉపాధి హామీ కూలీలు తమకు పనులు కల్పించడం లేదంటూ గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ రేణుకాదేవికి వినతిపత్రం అందజేశారు.
కూలీల వివరాల ప్రకారం, తమకు న్యాయంగా లభించాల్సిన ఉపాధి హామీ పనులను కల్పించడంలో సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి పనుల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో కుటుంబాలు ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో అధికారులు వివిధ కారణాలు చూపుతూ పనులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధి పనులు కల్పించడంతో పాటు సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
