Australian Open | క్వార్టర్ ఫైనల్స్ కి సింధు, తన్వీ..
- సిడ్నీలో భారత షట్లర్ల జోరు
- వరుస విజయాలతో ముందుకు
ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పివి సింధు, యువ క్రీడాకారిణి తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈరోజు (గురువారం) సిడ్నీలో జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో ఇద్దరూ వరుస గేమ్‌ల్లో విజయం సాధించి తదుపరి దశకు చేరుకున్నారు.
మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు, భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో ఇషారాణి పై 22-20, 21-12 తేడాతో గెలిచింది. 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టి పోటీ ఎదురైనా, రెండో గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించి క్వార్టర్స్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సింధు, చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యుతో తలపడనుంది.
సంచలనం సృష్టించిన తన్వీ..
ఇక 17 ఏళ్ల తన్వీ శర్మ మరోసారి ఆకట్టుకుంది. రెండో రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, ఐదో సీడ్ చియు పిన్-చియాన్ను ఓడించిన తన్వీ, ప్రీ-క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణి మాళవిక బన్సోద్‌పై 21-13, 21-15తో విజయం సాధించింది. భారత షట్లర్ తాన్యా హేమంత్ మాత్రం రెండో సీడ్ పోర్న్‌పావీ చొచువాంగ్ చేతిలో 12-21, 15-21తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదిలా ఉండగా.. కార్టర్స్ చేరుకున్న తన్వీకి కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆమె ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి, టోర్నీ టాప్ సీడ్ అకానే యమగుచితో పోటీ పడనుంది.
పురుషుల డబుల్స్‌లో భారత జోడీ ముందంజ
పురుషుల డబుల్స్ విభాగం భారత జోడీ హరిహరన్ అంశకరుణన్ – ఎం ఆర్ అర్జున్ ఆస్ట్రేలియా జోడీ మైకేల్ ఓవెన్, డిలాన్ సొయెడ్జాసాపై 21-17, 21-7తో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. తదుపరి రౌండ్‌లో వీరు చైనీస్ తైపీకి చెందిన చెన్ చెంగ్ కువాన్ – లియు కుయాంగ్ హెంగ్ జోడీని ఎదుర్కొనున్నారు.
కానీ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత జోడీకి నిరాశ తప్పలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ధృవ్ రావత్ – కె. మనీషా రెండో రౌండ్‌లో జపాన్ జోడీ అకిరా కోగా – నట్సు సైటో 19-21, 18-21తో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.
