ప్రతి నీటి బొట్టును ఒడిసి పడదాం…

ప్రతి నీటి బొట్టును ఒడిసి పడదాం…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
పినపాకలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమం ప్రారంభం.
సప్లయి ఛానెల్ పూడికతీత పనులకు శ్రీకారం.
జిల్లాలోనే స్ఫూర్తిదాయకం: కలెక్టర్ లక్ష్మీశ.

జి.కొండూరు, ఆంధ్రప్రభ : “ప్రతి నీటి బొట్టు అమూల్యం…నీటిని ఒడిసి పట్టి జలధారను కాపాడుతూ, జలహారతితో జలమాతకు వందనం చేద్దాం” అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు. జి.కొండూరు మండలం పినపాక గ్రామంలో ‘జలధార-జలహారతి’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం పినపాక సప్లయి ఛానెల్ పూడికతీత అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టి శ్రీకారం చుట్టారు. తొలుత గ్రామంలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ పులివాగు నుంచి పినపాక గంగాదేవి చెరువు వరకు ఉన్న సప్లయి ఛానెల్ ను 1100 మీటర్ల పొడవునా పూడిక తీయనున్నట్లు వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలతో పూడికతీత పనులు సాధ్యం కాని చోట రైతుల భాగస్వామ్యంతో యంత్రాలు పెట్టి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.

నీరు జీవనాధారం, జలధార ప్రకృతికి వరమని అభివర్ణించారు. ‘జలహారతి జల సంరక్షణకు మన సంకల్పం’ కావాలని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. జలమే జీవం, జల సంరక్షణే ధర్మం అని, ఇది ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తుచేశారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని రైతులకు సూచించారు. పినపాక సప్లయి ఛానెల్‌లో పేరుకుపోయిన పూడిక తొలగిస్తే ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు, కాలువల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వివరించారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని సంరక్షించాలని కోరారు. జల వనరులను కలుషితం చేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూడికతీత పనులను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో జలధార కార్యక్రమాన్ని ప్రతి నెలా నిర్వహిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. నీటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేలా అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లాలోనే స్ఫూర్తిదాయకం..

పినపాకలో రైతుల భాగస్వామ్యంతో కాల్వ అభివృద్ధి పనులు చేపట్టడం జిల్లాలోనే తొలిసారి అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు దీనికి చేయూతనిచ్చారని అన్నారు. ఈ పనులు పూర్తయితే చెరువుకు సులభంగా వర్షపు నీటి సరఫరా జరిగి చెరువు సాగు జలాలతో నిండుతుందని, రైతులకు సాగునీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు జిల్లాలోనే స్ఫూర్తి దాయకంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply