జిల్లాలో 6,515 మెట్రిక్ టన్నుల పైచిలుకు నిల్వలు..
జిల్లాలో 6,515 మెట్రిక్ టన్నుల పైచిలుకు నిల్వలు..
- ప్రతి స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ
- ఇప్పటివరకు 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- రైతుల ఖాతాలలో రూ.720.00 కోట్లు జమ
- జిల్లాలో 95 శాతం కొనుగోలు పూర్తి
- మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లాలో ప్రస్తుతం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 6,515 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అన్ని సహకార సంఘాల గోడౌన్లలో, సేల్ పాయింట్లలో అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. వానాకాలం సీజన్ పంటల సాగుకు అవసరమైన మేరకు పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. జిల్లాలో ఎక్కడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని, పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని వివరించారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీల పర్యవేక్షణ కోసం 24 టాస్క్ ఫోర్స్ బృందాలు నిరతరం తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. కొల్చారంలోని మల్లిఖార్జున ఎరువుల దుకాణంకు స్టాప్ సేల్స్ విషయంలో నోటీసులు జారీచేశామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో యాసంగి 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయన్నారు. గత యాసంగిలో జిల్లాలో సుమారు 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడిందన్నారు. దీనికి సంబంధించి రైతుల ఖాతాలలో రూ.720.00 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ధాన్యం రాక అధికంగా ఉండటం వల్ల రవాణా, అన్‌లోడింగ్, నిల్వల నిర్వహణ పై అదనపు ఒత్తిడి ఏర్పడినప్పటికీ, కొనుగోలు ప్రక్రియ ఎక్కడా నిలిచిపోలేదని స్పష్టం చేశారు.
తన పర్యవేక్షణలో సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు, రవాణా, రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలుకు మిగిలి ఉండగా, ఆ ధాన్యాన్ని రాబోయే రెండు రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయుటకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైస్ మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అదనపు రవాణా వాహనాలు, ఇంటర్మీడియట్ గోదాములు, సిబ్బందిని అందుబాటులో ఉంచి యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవడం, రవాణాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, అదనపు సిబ్బంది, ఇతర అవసరమైన వసతులు కల్పించినట్లు తెలిపారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు, అధైర్యానికి గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల మేరకు వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 95 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన కొనుగోలు ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమైనదని స్పష్టం చేశారు. రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.
