సైనిక్ స్కూల్‌కు ఎంపికైన ఎంపిపిఎస్ పల్లికొండ విద్యార్థి..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండల పరిధిలోని పల్లికొండ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మల్లెల జగత్ అద్భుత ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ సాధించి ఈ సీటును పొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెతరి మల్లేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మెతరి మల్లేష్, గ్రామ సర్పంచ్ పిండి మానుష (అశోక్) మాట్లాడుతూ, పల్లికొండ గ్రామ చరిత్రలోనే కాకుండా ఈ ప్రభుత్వ పాఠశాల నుండి సైనిక్ స్కూల్‌కు ఒక విద్యార్థి ఎంపిక కావడం ఇదే తొలిసారి అని గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందనడానికి ఈ విజయం నిదర్శనమని వారు తెలిపారు.

విద్యార్థి విశిష్ట ప్రతిభతో పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ విద్యార్థి దేశ రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ మేకల పూల, పాఠశాల హెడ్‌మాస్టర్ ఆరె మహేశ్వరి, ఉపాధ్యాయులు జి. సుధాకర్, సుమలత, భవాని, హరిత, దేవిక, వాలంటీర్లు సంగీత, అనూష, సుమలత, స్వర్ణలత, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.