ఉపాధి హమీ కూలీలకుపని భరోసా కల్పించాలి..
జైనూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఆరోగ్య భద్రతతో పాటు పని భద్రతను కల్పించాలని జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు.
బుధవారం జైనూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ (MGNREGA) పనులను సర్పంచ్ కొడప ప్రకాష్, ఈజీఎస్ సిబ్బంది, ఏపీవో నాగేష్, కార్యదర్శి ఆనంద్‌తో కలిసి పరిశీలించారు.
పనుల ప్రదేశంలో ఉన్న సౌకర్యాలపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. టెంట్ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం పనులు పూర్తిచేసి, సాయంత్రం వేళల్లో తిరిగి పనులు కొనసాగించాలని కూలీలకు సూచించారు. కూలీలకు నష్టం కలగకుండా వేతనాలు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
అలాగే ఉపాధి హామీ పనులను రోజువారీగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫోటో క్యాప్చరింగ్ విధానం వల్ల కూలీల హాజరు సరిగ్గా నమోదు కాకపోవడంతో వేతనాల్లో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఉపాధి కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన కోరారు.
కొత్త విధానాల వల్ల కూలీలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో నాగేష్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో ఆనందరావు, గ్రామపంచాయతీ ఈజీఎస్ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
