15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి: కాంగ్రెస్ నేతలు
15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి: కాంగ్రెస్ నేతలు
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
దశాబ్దానికి పైగా అధికారంలో ఉండి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనలో విఫలమైన వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వారు విమర్శించారు.
భూపాలపల్లిలో భూముల కబ్జాలు, కుటుంబ పాలన, కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వడం తప్ప ప్రజలకు ప్రయోజనం కలిగే కార్యక్రమాలు జరగలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కీలక పదవులు చేపట్టినా నియోజకవర్గానికి ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నాయకత్వంలో భూపాలపల్లి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. కేవలం 30 నెలల్లోనే విద్య, రహదారులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు.
గతంలో వివాదాస్పదంగా ఉన్న భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. మున్సిపాలిటీలో పారదర్శక పాలన కొనసాగుతోందని, ప్రజా ధనం వృథా కాకుండా కౌన్సిల్ తీర్మానాల మేరకే ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా వ్యాపారాలు, గృహ నిర్మాణాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సప్తన్న ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
