Nagarjuna Sagar Bugga Reservoir Issues | సమస్యల చట్రంలో సాగర్ బుగ్గ రిజర్వాయర్
సమస్యల చట్రంలో సాగర్ బుగ్గ రిజర్వాయర్
Nagarjuna Sagar Bugga Reservoir Issues |పూడికతో 3.5 టీఎంసీల నుంచి 2.5 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం
సాగు, తాగునీటి అవసరాలపై పెరుగుతున్న ప్రభావం
పూడిక తొలగింపు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చని పరిస్థితి
పూర్తిస్థాయిలో పనిచేయని గేట్లు
Nagarjuna Sagar Bugga Reservoir Issues | గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాలుగు జిల్లాల పరిధిలో సాగు, తాగునీటిని అందించే నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రధాన నీటినిల్వ ప్రదేశం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ కాలువలు ఏర్పడి 60ఏళ్లు దాటుతున్నా అత్యవసర పనులకు నోచుకోలేదు. డ్యాంకు దిగువన 33 కిలోమీటర్ల దూరంలోని కుడికాలువ నీటి నిల్వ కేంద్రం సమస్యల చట్రంలో చిక్కుకుంది.
బుగ్గ వాగు రిజర్వాయర్ 3.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉండాలి. కానీ పూడిక కారణంగా 2.5 టీఎంసీలకే పరిమితమైనట్లు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. పూడిక తొలగింపుకు రూ.3 కోట్లు అవసరమని గతంలోనే ప్రతిపాదనలు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు బుగ్గవాగు పక్కనే మరో రిజర్వాయర్ నిర్మించాలని, నీటిపారుదల నిపుణులు గతంలోనే సూచించారు. ఈ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు.
సాగు, తాగునీటిపై ప్రభావం
సాగర్ డ్యామ్ నుంచి విడుదల అయ్యే నీరు ముందుగా బుగ్గవాగుకు చేరుకుంటుంది. ఇక్కడ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత నీటిని దిగువకు విడుదల చేస్తారు. 1967 తర్వాత బుగ్గవాగు రిజర్వాయర్‌కు నిధులు కేటాయించి పనులు చేసిన దాఖలాలు లేవన్నది బహిరంగ రహస్యం.
గతంలో ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించినా బుగ్గవాగు సమీపంలో విద్యుత్ వెలుగుల పేరుతో అలంకారం చేశారు. ఈ పనులు మున్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.
11 లక్షల ఎకరాల ఆయకట్టు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు తాగునీటిని అందించే కుడికాలువకు ప్రధాన నీటి నిల్వ కేంద్రం ఇదే.
మరోవైపు బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల, గురజాల నియోజకవర్గంలోని పట్టణాలకు, పల్లెలకు తాగునీటి పథకాల రూపకల్పన జరుగుతుంది. ఇక్కడ రిజర్వాయర్ను పరిశీలిస్తే 3072 ఎకరాలలో విస్తరించి ఉంది.
కాలవ నుంచి వచ్చే వ్యర్థ్యాలతోపాటు, రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వర్షాలకు మట్టి కొట్టుకు వచ్చి చేరుతుంది. దీంతో రిజర్వాయర్ పూడికతో నిండిపోయింది. ప్రస్తుతం 2.5 టీఎంసి నీటి నిల్వ సామర్థ్యం ఉన్నట్లు నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చాలా తాగునీటి పథకాలకు బుగ్గవాగు రిజర్వాయర్ను ఎంపిక చేశారు. నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయినా ఇక్కడ ప్రస్తుతం ఏడాది పొడవునా నీటి నిల్వలు ఉంటాయా అంటే అధికారుల వద్ద సమాధానం లేదని చెప్పాలి.
నీరు దిగువకు వెళ్లకుండా నియంత్రించే గేట్లు సైతం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.
రెండో రిజర్వాయర్ నిర్మించరా?
బుగ్గవాగు పక్కనే మరో రిజర్వాయర్ నిర్మించాలని సాగర్ నిర్మాణ సమయంలోనే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రెండు రిజర్వాయర్ల ద్వారా 7.0 టీఎంసీలు నీటిని నిల్వ చేయాలన్నది ప్రతిపాదన.
సాగర్ నిర్మాణ సమయంలోనే ఇక్కడ భూములు రిజర్వాయర్ కోసం సిద్ధం చేశారు. ఈ భూములలో చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయి.
భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. రెండో రిజర్వాయర్ నిర్మాణం గనుక జరిగితే ఏడాది పొడవునా తాగునీటి అవసరాలు తీరతాయి. భూగర్భ జలాలు చుట్టుపక్కల మెరుగుపడే అవకాశం ఉంది.
