Revanth Reddy | హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం
Revanth Reddy | హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం
- మూసీ ప్రక్షాళన ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్..
- 100 రోజుల్లో పనులు ప్రారంభం
- మేడ్చల్-మల్కాజిగిరిలో రూ.1,511 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- రూ.98 కోట్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం
- రూ.416 కోట్లతో టీకేఆర్ జంక్షన్ వద్ద 6 లేన్ల ఫ్లైఓవర్
- 122 కి.మీ. మేర మెట్రో విస్తరణ ప్రణాళిక
- CURE-1 యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 కు వంద రోజుల్లో పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం తొలి దశగా గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు ప్రారంభించగా మరో దశగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని స్పష్టం చేశారు.
ఉప్పల్ భగాయత్ – ఫేజ్ III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి రూ. 1,511 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణంతో పాటు, రూ. 960 కోట్లతో AOC సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, రూ. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 వరుసల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం, రూ. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో CURE 1– Initiative (Common Unified Billing and Collection System) క్యూర్-1 యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మూసీ నది ప్రక్షాళన ఆవశ్యకతను, నగర అభివృద్ధి ప్రణాళికలు, మెట్రో విస్తరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కోర్ ప్రాంతాన్ని మూడు ప్రాంతాలుగా వికేంద్రీకరించడం వంటి అంశాలను ప్రజలకు వివరించారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోదని, ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలని చెప్పారు. నగరంలో 122 కి.మీ మేరకు అన్ని వైపుల మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నాగోల్ నుంచి ఎల్పీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరిస్తామని చెప్పారు.
మెట్రో విస్తరణకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. మెట్రోతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి నగర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. నగర అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమనా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది ప్రక్షాళన చేసుకున్నప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయొద్దని ప్రశ్నించారు. 55 కిలోమీటర్ల మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటే నగరం అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. నివసించడానికి ఏమాత్రం వీలులేకుండా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో విషయం నల్గొండ ప్రజల జీవితాలను కాటేస్తోంది.
నల్గొండ జిల్లాలో ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య, మరోవైపు మూసీ కాలుష్యంతో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా అని అన్నారు. ఏ పేదవాడికి అన్యాయం చేయం. ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇండ్లు ఇస్తాం. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం.
ఈ మల్కాజిగిరి ప్రాంతం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ లతో కలిసి నాలుగు రకాల పరిపాలన జరిగేది. ఒకరి మధ్య మరొకరికి సమన్వయం లేక అభివృద్ధికి అడ్డంకిగా మారింది. అంతర్జాతీయ నగరం అని చెప్పుకోవడం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే గుర్తింపు వస్తుంది.
ఓఆర్ఆర్ లోపల 1.34 కోట్ల మంది ప్రజలు, వివిధ అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటవుతున్న సందర్భంగా ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, మెట్రో, విద్యుత్, పోలీసు, మురుగునీటి పారుదల, మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ తెచ్చాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం 2100 చ.కి.మీ ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్భన్ రీజినల్ ఎకానమీ) ప్రాంతంగా గుర్తించి పలిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్టు తెలిపారు. ఇదే పద్ధతిలో పోలీసు వ్యవస్థను కూడా వికేంద్రీకరించామని అన్నారు.
లోక్‌సభ సభ్యుడిగా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ఆనాడు ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయానని ముఖ్యమంత్రి గారు పేర్కొంటూ మెట్రో విస్తరణతో పాటు ప్రతి పనిని చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.
“మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు వందల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. అవసరమైన అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని చెప్పారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఈ ప్రాంతానికి సుపరిచితులైన బండారి రాజిరెడ్డి గారు పెట్టామని గుర్తుచేస్తూ చౌరస్తాలో వారి విగ్రహం కూడా పెడదామన్నారు.
