8thJune2026 | తిరుమల సమాచారం..
8thJune2026 | తిరుమల సమాచారం..
శ్రీనివాసో జగన్నాథః శ్రీనివాసో దయానిధిః ।
శ్రీనివాసో జగత్పాలః శ్రీనివాసాయ మంగళమ్ ॥”
తాత్పర్యం:
సమస్త జగత్తుకు నాథుడైన శ్రీనివాసుడు అపారమైన కరుణాసాగరం. భక్తులను కాపాడే ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఎల్లప్పుడూ మంగళం కలగాలని ఈ శ్లోకం భావం.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 20 గంటల సమయం నుంచి 24 గంటల పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
ఆదివారం ఒక్కరోజే 93,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 41,754 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ3.83 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఆదివారం 4.22 లక్షల లడ్డూలు విక్రయించినట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో తాగునీరు, అన్నప్రసాదం 3.12 లక్షల మందికి, 4,005 మందికి మెడికల్ ట్రీట్మెంట్స్ అందించారు.
