ఇంటి వద్దే చెత్త విభజన..
ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కీలకం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: వ్యర్థాలను ఉత్పత్తి అయిన చోటే తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక (హానికర) వ్యర్థాలుగా వేరు చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మూడో వారపు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు.

మద్దూర్‌నగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీవో సందీప్‌తో కలిసి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, ప్రతి కుటుంబం ఇంటి వద్దనే చెత్తను నాలుగు వర్గాలుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను కలిపి ఇవ్వడం వల్ల పునర్వినియోగం, శాస్త్రీయ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, విభజించి ఇవ్వడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావచ్చని అన్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల అమలుపై దృష్టి
ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026 పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం అధిక మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు తమ వద్దే వ్యర్థాలను ప్రాసెస్ చేసి కంపోస్టుగా మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రోజుకు 100 కిలోలకుపైగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లు, 20 వేల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన వాణిజ్య సముదాయాలు, రోజుకు 40 వేల లీటర్లకు మించి నీటిని వినియోగించే సంస్థలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయని వివరించారు.
వాల్‌మార్ట్‌లో వ్యర్థాల నిర్వహణ కేంద్రం పరిశీలన
అనంతరం బిర్లా కాంపౌండ్‌లోని Walmart కేంద్రంలో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), తడి వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్, ప్రమాదకర వ్యర్థాల నిల్వ కేంద్రం, పునర్వినియోగ వ్యర్థాల నిల్వ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ విధానాన్ని నగరంలోని ఇతర బల్క్ వేస్ట్ జనరేటర్లు కూడా అనుసరించాలని సూచించారు.
వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక కంపోస్టింగ్ యూనిట్లు, వ్యర్థాల సేకరణ డబ్బాలు, రికార్డు నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డంప్‌యార్డులో ప్రాసెసింగ్ యూనిట్ల తనిఖీ
కలెక్టర్ గార్గేయపురం డంప్‌యార్డును సందర్శించి విండ్రో కంపోస్టింగ్ యూనిట్లు, వర్మీ కంపోస్టింగ్ యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) కేంద్రాలను పరిశీలించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా కంపోస్టు తయారీ, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.
అలాగే కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
హోటళ్లు, ఫంక్షన్ హాల్స్‌కు ప్రత్యేక సూచనలు
కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లలో మిగిలిపోయే ఆహార వ్యర్థాలను మురుగునీటి కాలువల్లో వేయకుండా ప్రత్యేకంగా సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. తడి వ్యర్థాలను స్థానికంగానే కంపోస్టింగ్ చేయాలని, పొడి వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపించాలని, శానిటరీ, హానికర వ్యర్థాలను ప్రత్యేకంగా నగరపాలక సంస్థకు అప్పగించాలని పేర్కొన్నారు.
‘స్వచ్ఛమైన కర్నూలు కోసం అందరూ భాగస్వాములు కావాలి’
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ఇంటి వద్దే వ్యర్థాలను వేరు చేయడం, ప్రతి బల్క్ వేస్ట్ జనరేటర్ తమ వద్దే వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత కర్నూలు నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. రీసైక్లింగ్ ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎస్ఈ రమణమూర్తి, డీఈఈ పవన్‌కుమార్‌రెడ్డి, ఏఈ వైష్ణవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
