Cockroach Protest | కాక్రోచ్ తొలి కార్యక్రమం సక్సెస్
Cockroach Protest | కాక్రోచ్ తొలి కార్యక్రమం సక్సెస్
Cockroach Protest | విద్యా వ్యవస్థ వైఫల్యాలపై ఆందోళనకు పిలుపు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో ధర్నా
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుత ఆందోళన
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ సహా భారీగా యువత హాజరు
కాక్రోచ్ మాస్క్ ధరించి నిరసనలో పాల్గొన్న జెన్ జెడ్ తరం
Cockroach Protest | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, దేశ విద్యావ్యవస్థలో జరుగుతున్న లోపాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వేదికగా భారీ ఉద్యమం మొదలైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపునిచ్చిన జంతర్ మంతర్ శాంతియుత నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఉదయం నుంచే జంతర్ మంతర్ వద్దకు యువత భారీగా తరలివచ్చారు.. అక్కడ శాంతియుతంగా నిరసన ప్రదర్శన కొనసాగింది. ఈ నిరసన సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. నిరసనలో కాక్రోచ్ మాస్కులతో యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిరసనలో పాల్గొన్న అభిజీత్..
కాగా, నిరసనకు వచ్చే వారు ఒక పుస్తకం, జాతీయ జెండా తీసుకురావాలని సీజీపీ నేత అభిజీత్ సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జంతర్ మంతర్ వద్ద అందరినీ కలుసుకోవాలని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఉద్యమం ప్రేమ, శాంతి, రాజ్యాంగబద్ధ విలువల ఆధారంగా కొనసాగాలని తెలిపారు. నిరసనలో పాల్గొనే వారు పోలీసు సిబ్బందికి పూలు అందించి కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. ఉద్యమం హింసాత్మకంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగాలని, ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఈ నిరసన కార్యక్రమం కొనసాగడం విశేషం.
అరెస్టు చేస్తే దీక్ష చేస్తాం : సోనమ్ వాంగ్‌చుక్
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. దిప్కేను అరెస్టు చేస్తే తాను ఆరు వారాలపాటు నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. నిరసనలో పాల్గొనే యువత శాంతియుతంగా వ్యవహరించాలని, అధికారులతో సహకరించాలని సూచించారు. నీటి సీసాలు, మొబైల్ ఫోన్లు వంటి అవసరమైన వస్తువులనే వెంట తీసుకురావాలని చెప్పారు. పూలు తీసుకురావాలని కూడా ప్రోత్సహించారు. అలాగే ఎవరైనా ఆయుధాలు లేదా అనుమానాస్పద వస్తువులు తీసుకువస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
భారీగా పోలీసుల మోహరింపు
నిరసన నేపథ్యంలో జాతీయ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌మంతర్ పరిసరాలతో పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రవేశ మార్గాలు, కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు. అయితే పోలీసులకు నిరసన నిర్వహణకు సంబంధించి అధికారిక అనుమతి అభ్యర్థన అందలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల పర్యవేక్షణతో పాటు ఇతర సమాచార ఆధారాలపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
click here to read Goddali Party | ప్రజాసేవే కార్యకర్తల లక్ష్యం కావాలి
