ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ ఇకలేరు

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ ఇకలేరు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: మండలి వెంకట కృష్ణారావు డీ.ఈడి కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు, సాహితీవేత్త డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ శనివారం ఉదయం విజయవాడలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణుప్రసాద్ మరణం యావత్ దివిసీమ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు.

విష్ణుప్రసాద్ అందించిన బహుముఖ సేవలు

సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విష్ణుప్రసాద్ గారు చెరపలేని ముద్ర వేశారు. రచయితగా ఆయన 25కు పైగా గ్రంథాలను రచించడమే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్ వంటి వివిధ మాధ్యమాలలో వందలాది సాహిత్య ప్రసంగాలు, బాలవికాస్ క్విజ్ కార్యక్రమాలను నిర్వహించారు. “దివిసీమ కవులు – సాహిత్య సేవ” అనే అంశంపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనా గ్రంథాన్ని మాననీయ మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితమిచ్చారు. ఆయన రాసిన ‘దివిసీమ వైభవం’, ‘దివిసీమ కుల చరిత్రలు’ అనే ఆకాశవాణి ప్రసంగాలను ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీలోకి అనువదించి ముద్రించడం విశేషం.

వ్యాకరణ భారతి, గేయ భారతి, బాల దీపిక, అక్షర భారతితో పాటు భరత బాల శతకం, స్వచ్ఛభారతి శతకం వంటి అనేక శతకాలను ఆయన రచించారు. ఆంధ్రప్రదేశ్ పాఠ్యగ్రంథ రచయితగా, స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించిన ఆయన, ఎస్.సి.ఆర్.టి. (SCERT) ద్వారా 200కు పైగా బాల సాహిత్య గ్రంథాలను అందించారు. ఆయన రాసిన పద్యాలు పాఠ్యపుస్తకాల్లో కూడా చోటు సంపాదించుకున్నాయి.

పలు సంస్థలలో కీలక బాధ్యతలు

దివిసీమ సాహితీ సమితి అధ్యక్షులుగా, ఆరోగ్య భారతి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా, కృష్ణాజిల్లా రచయితల సంఘం సహాయ కార్యదర్శిగా, భారతీయ సాహిత్య పరిషత్ అవనిగడ్డ కార్యదర్శిగా ఆయన సమాజానికి విశేష సేవలు అందించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, కృష్ణా పుష్కరాల సందర్భంగా 10 వేల మంది విద్యార్థులతో నిర్వహించిన భారీ కోలాట నృత్య రూపకానికి గేయ రచన చేయడంలో కీలక పాత్ర పోషించారు. ‘అంతిమ తీర్పు’ అనే లఘు చిత్రానికి కథను అందించడంతో పాటు అందులో నటించారు.

పురస్కారాల పరంపర

విద్యా, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన సేవలకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ‘రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని’ స్వీకరించారు. అలాగే బాల సాహితీవేత్తగా కిన్నెర పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన సాహితీ ప్రస్థానంపై డాక్టర్ సుజాత గారు పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందడం ఆయన సాహిత్య పటిమకు నిదర్శనం.

ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ ఇకలేరు

Leave a Reply