Peddi Movie | బుచ్చిబాబు మాటల్లో ‘పెద్ది’ సీక్రెట్స్
Peddi Movie | బుచ్చిబాబు మాటల్లో ‘పెద్ది’ సీక్రెట్స్
చరణ్ గాయం.. చిరు ఫోన్!
Peddi Movie | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు ఉన్న బజ్ దృష్ట్యా రిలీజ్ ట్రైలర్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రతి సినిమా చూసేందుకు ట్రైలర్ అవసరమా? అని ప్రశ్నిస్తూ, ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి ఉందని తెలిపారు.
జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ బుచ్చిబాబు ఆమెపై ప్రశంసలు కురిపించారు. జాన్వీ చాలా తెలివైన అమ్మాయి అని, నిన్నటి ఈవెంట్లో తెలుగులో మాట్లాడేందుకు తన అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుందని చెప్పారు. ఈరోజు ప్రెస్‌మీట్ ఉందని చెప్పగానే “నా తెలుగు అయిపోయింది” అంటూ సరదాగా స్పందించిందని తెలిపారు. శ్రీదేవి కూతురిని అనే పొగరు ఆమెకు ఇసుమంత కూడా లేదని బుచ్చిబాబు కొనియాడారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో తన ప్రయాణం అద్భుతంగా సాగిందని బుచ్చిబాబు అన్నారు. ఇకపై తాను చేసే సినిమాలన్నింటికీ రెహమానే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలని తన కోరికని వెల్లడించారు.
షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కంటికి గాయం అయిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బుచ్చిబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో చాలా భయపడ్డానని, చిరంజీవి ఫోన్ చేసి మందలిస్తారేమోనని అనుకున్నానని చెప్పారు. అయితే చిరంజీవి ఫోన్ చేసి గాయం జరిగిన వీడియో పంపమని అడిగారని బుచ్చిబాబు తెలిపారు.
సోషల్ మీడియాపైనా బుచ్చిబాబు ఆసక్తికర విషయం చెప్పారు. తాను ప్రస్తుతం సోషల్ మీడియాలో లేనని, అన్ని యాప్‌లను డిలీట్ చేసేశానని వెల్లడించారు. సినిమా పని మీదే పూర్తిగా దృష్టి పెట్టినట్లు ఆయన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.
